భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Saturday, August 7, 2010

ఏ దేశమున

ఏ దేశమున నుండువారూ - మీరు ఎందుండి యిట వచ్చినారూ?
తొలుత గోదావరియందు - మా స్థలము భద్రాచలమందూ

ఎవరి జవానులు మీరూ - మిమ్మెవరు పంపగ వచ్చినారు?
దాస జవానులు మేమూ - రామదాసు పంపగ వచ్చినాము

ఏమి కులమువారు మీరు - మీరిద్దరు నే వరుస వారూ?
ఇనవంశమున బుట్టినామూ - మేమిద్దఱ మన్నదమ్ములము

ఏమి నామము గలవారూ - మీరేమి నీమము గలవారు?
రామోజి లక్ష్మోజి నామం - మేము రామానుజమతమువారం

ఎందుకు పంపించినారు - మీరేమి పనిగ వచ్చినారు?
సర్కారుబ్బాకీ పయికం - మా చేతబంపగ వచ్చినాము

అర్థమంతయు దెచ్చినారా - లేక వ్యర్థముగా వచ్చినారా?
వ్యర్థులము మేము కాము - మీ యర్థ మంతయు దెచ్చినాము

బైఠోజీ బైఠోజీ మీరు - మీ బాటలు చూడగ వేరు
బైఠోవారముగాము మేము - మీ భేటికి నిట వచ్చినాము

ధనము మా చేతికియ్యండీ - యా వెనుక ఖైదులోకి పొండీ
ఖైదులోకి మేము పోమూ - మీ ఖజాన పయిక మిచ్చేము

చెల్లింతురా ద్రవ్యమంతా - రసీదుల నడుగుట వింతా!  
ఉంగరంబు విడెమందూ - నుప్పొంగుచు దొర దట్టియందు 
మొహరు జేసినంతలోన - జగన్మోహనాంగులు సంతోషమున

Saturday, May 22, 2010

ఆనంద మానందమాయెను

ఆనంద మానందమాయెను శ్రీజానకి రామస్మరణ చేయగనే

నేడార్యులకృప మాకు కలిగెను ఇప్పుడిరువ
దేడింటనున్న పరమాత్ముని జూడగానే || ఆనంద మానందమాయెను ||

పరమభక్తి శ్రద్ధగల్గెను బహు
దురితజాలములెల్ల దొలగెను || ఆనంద మానందమాయెను ||

పటురాగ ద్వేషములెల్లవీడెను
ఇటు రాజయోగమున ఉన్న రాజును జూడగ || ఆనంద మానందమాయెను ||

పూర్వపుణ్యము లొనగూడెను శ్రీ
పార్వతి జపమంత్రమీడేరెను || ఆనంద మానందమాయెను ||

పూర్వకృతమ్బు కనబడెను పరమ
పావనమైన శ్రీహరి సేవగల్గె నేడు || ఆనంద మానందమాయెను ||

సామాన్యుల చెంత చేరాము వట్టి
పామరజనుల నిక గూడము మేము || ఆనంద మానందమాయెను ||

కామబద్దుల జేరి వేడము మాకు హరి
నామ స్మరణజేయు భాగవతులె దిక్కు || ఆనంద మానందమాయెను ||

రామభక్తుల జేరగల్గితిమి ఇతర
కామము లెల్లను వీడగల్గితిమి || ఆనంద మానందమాయెను ||

పరభామలపైని భ్రాంతిదొలగెను మేము
పరుషదోషములెన్న మొరులను నెదురాడము || ఆనంద మానందమాయెను ||

ఇతర చింతనల చేయము వేరే
ఇతర దైవములను గొనియాడము మేము || ఆనంద మానందమాయెను ||

ధరాపతులకు మ్రొక్కింత సేయము
భద్రాచల రామసేవ మానము మానము || ఆనంద మానందమాయెను ||

భద్రాద్రి స్వామి మాకు దైవము వేరు
క్షుద్రదేవతలను దలపము దలపము || ఆనంద మానందమాయెను ||

దారిద్ర్యములనెల్ల మది నెంచము భద్ర
గిరి రామదాసునేలిన పరమదయాళుడుండ || ఆనంద మానందమాయెను ||

ఆదరణలేని

ఆదరణలేని రామమంత్ర పనమద్రిజ ఏమనిచేసెను రామా
అదెనీకు నామీద ముదమొప్ప దయయున్న అదె తెలిపి మాటాడవా శ్రీరామా

పరమద్రోహిని నిన్ను పతితపావనుడని ప్రహ్లాదుడెటువలె తలచెనో
పరమపావనసతి నడవికి పంపిన పాపకర్మునకెటు దయవచ్చునో రామా || ఆదరణలేని ||

ఆది పరబ్రహ్మమనుచు నిను పరమేష్టి ఏరీతి ప్రస్తుతి చేసెనో
వద్దు పరసతులనక స్త్రీల భంగపరచినవాని వరలక్ష్మి ఎటుమెచ్చెనో రామా || ఆదరణలేని ||

ఎన్నగ శబరియెంగిలి భక్షించిన తిన్నని నడత లేనివాడవు
నిన్ను నమ్మరాదు నిన్నుదైవమనరాదు నిజము నామాట రామా || ఆదరణలేని ||

ఆదరణలేని రామమంత్రము ఆడితిని నినుదూరితిని
ముద్దుమాటలుగాని మూర్ఖవాదముగాదు మురహర ననుగావుమీ రామా || ఆదరణలేని ||

ముద్దుమోముజూపి ముదమొప్ప రక్షించు భద్రశైల పరిపాలకా
వద్దురా కృపనేలు రామదాసునిమీద వైరమా వైదేహిసహిత శ్రీరామా || ఆదరణలేని ||

అయ్యయ్యో నేడెల్ల

అయ్యయ్యో నేడెల్ల యీ జీవునకు సుఖమెయ్యెడ లేదుగదా రామయ్య
చయ్యన రఘుకుల సార్వభౌమా ఏ చందాన బ్రోచెదవో రామయ్య

వనజనాభుని మాయ తెలియకనే వెఱ్ఱిపగల బొందుచుంటిగా కొన్నాళ్ళు
మునుపు జేసిన పుణ్యపాప సంఘములచే మునిగి తెలుచుంటిగా కొన్నాళ్ళు

ఎనుబదినాల్గు లక్షల యోనులందెల్ల వేసరక పుట్టితిగా కొన్నాళ్ళు
అయ్య ఆలంబనము లేక నాకాశమున నలసట నొందితిగా కొన్నాళ్ళు

మేను తెలియగ లేక మిన్ను లోపల జిక్కి మినుకుగ నుంటినిగదా కొన్నాళ్ళు
ఈలాగు వచ్చి మేఘమధ్యమునందు నిడుమల పడుచుంటిగా కొన్నాళ్ళు

జాలినొంద సూర్యకిరణములో జొచ్చి చలనము నొందితిగా కొన్నాళ్ళు
వర్షములోజిక్కి వసుమతిమీదనె వర్తించుచుంటిగదా కొన్నాళ్ళు

వరుస శషసస్యగతమైన ధాన్యముల వదలి వర్తించితిగా కొన్నాళ్ళు
పురుషుడారగించు నన్నముతోనే నట్టు జేరియుంటిగా కొన్నాళ్ళు

వరనరుని రేతస్సువల్ల నారీగర్భనరకమున బడియుంటిగా ఓ రామ!
ఆ త్రిప్పుడు తిత్తిలో బదినెలలు ప్రవర్తిల్లుచుంటినిగా కొన్నాళ్ళు

అప్పుడు మాతల్లి యుప్పుపులుసుదిన నంగలార్చుచుంటి గదా కొన్నాళ్ళు
ఎప్పుడు నిందుండి బయలు వెళ్ళుదునని ఎదురుచూచుచుంటి గదా కొన్నాళ్ళు

చెప్పరానియట్టి ద్వారములోను బడి జననమొందితిని గదా రామయ్య
పొరలు దుర్గంధపు పొత్తిళ్ళలో నలిగి పరలుచు నుంటిగదా కొన్నాళ్ళు

పెరుగుచు బాల్యావస్థల కొన్నిదినములు పరుగులాడుచునుంటిగా కొన్నాళ్ళు
లే తరుణులతో గూడి మదమత్సరంబులు తన్నెరుగలేనైతినిగదా కొన్నాళ్ళు

తరువాత దారపుత్రాది మోహములదగిలి వర్తించితిగదా ఓ రామ!
తెల్లతెల్లనై దంతము లూడివణుకుచు తడబడుచుంటిగదా కొన్నాళ్ళు

బలముదీరి కండ్లు పొరలు గప్ప పరుల బ్రతిమాలుచుంటిగదా కొన్నాళ్ళు
అంతట మృతినొంది యలయుచు యమునిచేబాధలొందితిగా కొన్నాళ్ళు

ఎంతగా నీరీతి పుట్టుచు గిట్టుచు వేదనబడుచుంటిగా కొన్నాళ్ళు
కంజజనక  భాద్రచాలపతివగు నిన్ను గనలేక తిరిగితిగదా కొన్నాళ్ళు

వింతగ నేరామదాసుడనైతిని నింకెట్లు బ్రోచెదవో ఓ రామ!

అబ్బబ్బా దెబ్బలకు

అబ్బబ్బా దెబ్బలకు నోర్వలేనురా
జబ్బుసేయకురా తబ్బిబ్బాయెనురా 

అట్టె నిను పూజించినట్టి చేతులనిదిగో
కట్టె బెట్టి కొట్టిరెటు తాళుదునయ్య  || అబ్బబ్బా దెబ్బలకు ||

రట్టుతీర్చీవేళ గట్టిగా నీవునను
జెట్టుబట్టి యేలుకో పట్టాభిరామ || అబ్బబ్బా దెబ్బలకు ||

శరణాగతత్రాణ బిరుదాంకుడవుగాద   
శరధిబంధించిన శౌర్యమేమాయెరా || అబ్బబ్బా దెబ్బలకు ||

పరంధామ నీ పాదములాన వినరా
పరులకొక్క కాసు నే నివ్వలేదురా || అబ్బబ్బా దెబ్బలకు ||

భద్రాద్రి శ్రీరామ నీ నామమెపుడు
ప్రేమతో భజియించు రామదాసునేలు || అబ్బబ్బా దెబ్బలకు ||