తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు
ప్రక్క తోడుగా భగవంతుడు తన
చక్రధారియై చెంతనె యుండగ || తక్కువేమి ||
మ్రుచ్చు సోమకుని జంపిన యా
మత్స్యమూర్తి మన పక్షము నుండగ || తక్కువేమి ||
సురల కొరకు మందరగిరి మోసిన
కూర్మావతారుని కృపమనకుండగ || తక్కువేమి ||
దురాత్ముడౌ హిరణ్యాక్షు ద్రుంచిన
వరాహమూర్తి మనవాడై యుండగ || తక్కువేమి ||
హిరణ్యకశిపుని ఇరుచెక్కలుగా
పరచిన నరహరి ప్రక్కన నుండగ || తక్కువేమి ||
భూమి స్వర్గమును పొందుగ గొలిచిన
వామనుండు మనవాడై యుండగ || తక్కువేమి ||
ధరలో క్షత్రియులను దండించిన
పరశురాముని దయ మనకుండగ || తక్కువేమి ||
దశగ్రీవు మును దండించిన యా
దశరథరాముని దయ మనకుండగ || తక్కువేమి ||
ఇలలో యదుకులమున నుదయించిన
బలరాముడు మన బలమై యుండగ || తక్కువేమి ||
దుష్ట కంసుని ద్రుంచినట్టి శ్రీ
కృష్ణుడు మనపై కృపతో నుండగ || తక్కువేమి ||
కలియుగాంత్యమున కలిగిన దైవము
కలికిమూర్తిమము గాచుచు నుండగ || తక్కువేమి ||
నారాయణదాసుని గాచిన శ్రీమన్
నారాయణు నెర నమ్మియుండగ || తక్కువేమి ||
రామదాసు నిల రక్షించెదనని
ప్రేమతొ పలికిన ప్రభువిట నుండగ || తక్కువేమి ||
Download
No comments:
Post a Comment