ఏతీరుగ నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా
నాతరమా భవ సాగర మీదను నళినదళేక్షణ రామా || ఏతీరుగ ||
శ్రీ రఘునందన సీతారమణా శ్రితజనపోషక రామా
కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కానుపు రామా || ఏతీరుగ ||
మురిపెముతో నా స్వామివి నీవని ముందుగ తెల్పితి రామా
మరవక యిక నభిమానముంచు నీ మరుగుజొచ్చితిని రామా || ఏతీరుగ ||
క్రూరకర్మములు నేరక జేసితి నేరము లెంచకు రామా
దారిద్ర్యము పరిహారము చేయవె దైవశిఖామణి రామా || ఏతీరుగ ||
గురుడవు నామది దైవము నీవని గురుశాస్త్రంబులు రామా
గురుదైవంబని యెరుగక తిరిగెడు క్రూరుడ నైతిని రామా || ఏతీరుగ ||
నిండితి వీ వఖిలాండకోటి బ్రహ్మాండములందున రామా
నిండుగ మది నీ నామము దలచిన నిత్యానందము రామా ||ఏతీరుగ ||
వాసవ కమల భవాసురవందిత వారధి బంధన రామా
భాసురవర సద్గుణములు గల్గిన భద్రాద్రీశ్వర రామా || ఏతీరుగ ||
వాసవనుత రామదాస పోషక వందన మయోధ్యరామా
దాసార్చిత మాకభయ మొసంగవె దాశరధీ రఘురామా || ఏతీరుగ ||
Download
No comments:
Post a Comment