భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Showing posts with label అడుగుదాటి కదల. Show all posts
Showing posts with label అడుగుదాటి కదల. Show all posts

Thursday, May 20, 2010

అడుగుదాటి కదల

అడుగుదాటి కదల నియ్యను
నా కభయ మియ్యక నిన్ను విడువను || అడుగు ||

గడియ గడియకు తిరిగి తిరిగి
యడిగితిని వేసార వచ్చెను
గడువు తప్పిన నేను నిక బహు
దుడుకుతనములు సేయుదును నిను || అడుగు ||

కుదురుగా కూర్చుండనియ్యను
కోపమొచ్చిన భయముచెందను
మది నెరింగీ యుండుమిక మొగ
మాట మేమియు లేదుగద నా
హృదయకమలమునందు నీ మృదు
పదములను బంధించివేతును || అడుగు ||

రేపు మాపని జరిపితే నే
నపుజేసెడివాడగాను
ప్రాపు నీవని నమ్మి కొలిచిన
పాపముల నెడబాపి దయతో
తేప తేపకు నీదు మోమిటు
జూపకుండిన నోర్వసుమ్మి || అడుగు ||

పతితపావన బిరుదు లేదా
పాలనము నను సేయరాదా
ప్రతి దినంబును దేవ నిను భూ
పతి వటంచును వేడినను నీ
హిత జనంబులు వచ్చి నను బ్రతి
మాలినను విడబోను నిన్ను || అడుగు ||

రాక్షసాంతక భక్తవరదా
సారసాక్ష సుజనరక్షక
ఈ క్షణంబున దీనజనుడని
మోక్షమియ్యక యుంటివ నిను
సాక్షిబెట్టియు నేడు నేనొక
దీక్షచే సాధింతు నిన్ను || అడుగు ||

భూరి భద్రాచల నివాసా
భుజగశయనా భక్తపోష
కూరిమిగ నిను విడిచిపెట్టిన
ధరణిలో భద్రాద్రిరాఘవ
రామదాసుం డనెడి నామము
మారుపేరున పిలువు నన్ను || అడుగు ||


Download