భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Showing posts with label సీతారామస్వామి. Show all posts
Showing posts with label సీతారామస్వామి. Show all posts

Friday, May 21, 2010

సీతారామస్వామి

సీతారామస్వామి నే జేసిన నేరంబేమి || సీతా ||

ఖ్యాతిగ నీపద పంకజములు నే
ప్రీతిగ తలుపక భేద మెంచితినా || సీతా ||

తంగుగ నా పదివేళ్ళకు రత్నపు టుంగరములు నిన్నడిగితినా
సంగతి బంగరు శాలువ పాగా లంగీల్ నడికట్లడిగితినా
చెంగటి భూసుర పుంగవు లెన్నగ చెవులకు చౌకట్ల డిగితినా
పొంగుచు మువ్వలు ముత్యపుసరములు బాగుగ నిమ్మని యడిగితినా || సీతా ||

ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమ కిరీటంబడిగితినా
కోమలమగు నీ మెడలో పుష్పపు ధామంబులు నే నడిగితినా
మోమాటము పడకుండగ నీవగు మురుగులు గొలుసులు అడిగితినా
కమలేక్షణ మిము సేవించుటకై ఘనముగ రమ్మని పిలిచితిగాని || సీతా ||

తరచుగ నీ పాదంబుల నమరిన సరిగజ్జెలను అడిగితినా
కరుణారస ముప్పొంగ మీ గజ తురగము లిమ్మని యడిగితినా
పరమాత్మ నీ బంగరు శాలువ పై గప్పగ నే నడిగితినా
స్మర సుందర సురవర సంరక్షక వరమిమ్మని నిన్నడిగితినా || సీతా ||

ప్రశస్త భద్రాద్రీశుడవని నిను ప్రభుత్వ మిమ్మని యడిగితినా
దశరధ సుత నీచేత ధరించిన దాన కంకణ మ్మడిగితినా
విశదముగను నీ మేలిమి మొల నూల్ వేడుకతో నే నడిగితినా
యేదుము భూమిని కుచ్చల నేలకు నెక్కువగా నిన్నడిగితినా || సీతా ||


Download