భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Showing posts with label అయ్యయ్యో నేడెల్ల. Show all posts
Showing posts with label అయ్యయ్యో నేడెల్ల. Show all posts

Saturday, May 22, 2010

అయ్యయ్యో నేడెల్ల

అయ్యయ్యో నేడెల్ల యీ జీవునకు సుఖమెయ్యెడ లేదుగదా రామయ్య
చయ్యన రఘుకుల సార్వభౌమా ఏ చందాన బ్రోచెదవో రామయ్య

వనజనాభుని మాయ తెలియకనే వెఱ్ఱిపగల బొందుచుంటిగా కొన్నాళ్ళు
మునుపు జేసిన పుణ్యపాప సంఘములచే మునిగి తెలుచుంటిగా కొన్నాళ్ళు

ఎనుబదినాల్గు లక్షల యోనులందెల్ల వేసరక పుట్టితిగా కొన్నాళ్ళు
అయ్య ఆలంబనము లేక నాకాశమున నలసట నొందితిగా కొన్నాళ్ళు

మేను తెలియగ లేక మిన్ను లోపల జిక్కి మినుకుగ నుంటినిగదా కొన్నాళ్ళు
ఈలాగు వచ్చి మేఘమధ్యమునందు నిడుమల పడుచుంటిగా కొన్నాళ్ళు

జాలినొంద సూర్యకిరణములో జొచ్చి చలనము నొందితిగా కొన్నాళ్ళు
వర్షములోజిక్కి వసుమతిమీదనె వర్తించుచుంటిగదా కొన్నాళ్ళు

వరుస శషసస్యగతమైన ధాన్యముల వదలి వర్తించితిగా కొన్నాళ్ళు
పురుషుడారగించు నన్నముతోనే నట్టు జేరియుంటిగా కొన్నాళ్ళు

వరనరుని రేతస్సువల్ల నారీగర్భనరకమున బడియుంటిగా ఓ రామ!
ఆ త్రిప్పుడు తిత్తిలో బదినెలలు ప్రవర్తిల్లుచుంటినిగా కొన్నాళ్ళు

అప్పుడు మాతల్లి యుప్పుపులుసుదిన నంగలార్చుచుంటి గదా కొన్నాళ్ళు
ఎప్పుడు నిందుండి బయలు వెళ్ళుదునని ఎదురుచూచుచుంటి గదా కొన్నాళ్ళు

చెప్పరానియట్టి ద్వారములోను బడి జననమొందితిని గదా రామయ్య
పొరలు దుర్గంధపు పొత్తిళ్ళలో నలిగి పరలుచు నుంటిగదా కొన్నాళ్ళు

పెరుగుచు బాల్యావస్థల కొన్నిదినములు పరుగులాడుచునుంటిగా కొన్నాళ్ళు
లే తరుణులతో గూడి మదమత్సరంబులు తన్నెరుగలేనైతినిగదా కొన్నాళ్ళు

తరువాత దారపుత్రాది మోహములదగిలి వర్తించితిగదా ఓ రామ!
తెల్లతెల్లనై దంతము లూడివణుకుచు తడబడుచుంటిగదా కొన్నాళ్ళు

బలముదీరి కండ్లు పొరలు గప్ప పరుల బ్రతిమాలుచుంటిగదా కొన్నాళ్ళు
అంతట మృతినొంది యలయుచు యమునిచేబాధలొందితిగా కొన్నాళ్ళు

ఎంతగా నీరీతి పుట్టుచు గిట్టుచు వేదనబడుచుంటిగా కొన్నాళ్ళు
కంజజనక  భాద్రచాలపతివగు నిన్ను గనలేక తిరిగితిగదా కొన్నాళ్ళు

వింతగ నేరామదాసుడనైతిని నింకెట్లు బ్రోచెదవో ఓ రామ!