భద్రాద్రి రాముడి మీద భక్తితో రామదాసు పాడిన కీర్తనలు...........

Pages

Friday, May 21, 2010

అబ్బబ్బ రామనామ

అబ్బబ్బ రామనామ మత్యద్భుతం
గొబ్బున యే భాగ్యశాలి కబ్బునో శ్రీరామ నామం 

సారహీన సంసార సాగరమీదే నామం
పారద్రోలు మున్నూటరువది పాప జాలం
చేరి పంచేంద్రియములన్ని చేరక పోదోలు నామం
ఘోరమైన యమదూతలను కొట్టెడు నామం 

దబ్బరాడు మన్మధుని దౌలమించు నామం
గొబ్బున మోహపాశముల కోసేటి నామం
మొబ్బుదూది కొండవంటి మైబుట్టిన పాపములన్ని
అబ్బనిను గురువలే గాల్చునా రామ నామం 

కామక్రోధ లోభమోహ గర్వమడచే నామం
స్వామి భద్రాద్రీశుని తోడి సద్గతి నామం
నీమముతో పలికితేను నిత్యమోక్షపదవి నామం
రామదాసు నేలినట్టి నామం శ్రీరామ నామం


Download

ఎంతో మహానుభావుడవు

ఎంతో మహానుభావుడవు నీవు
ఎంతో చక్కని దేవుడవు
వింతను చేసితివీ లోకమందున
సంతత భద్రాద్రిస్వామి రామచంద్ర

తొలివేల్పు జాంబవంతుని చేసినావు
మలివేల్పు పవనుజుగా జేసినావు
వెలయ సూర్య సుగ్రీవుగ జేసినావు
ఇల సర్వసురలకోతుల జేసినావు

కారణ శ్రీసీతగ జేసినావు
గరిమ శేషుని లక్ష్మణుని జేసినావు
ఆ రెంటిని భరతశత్రుఘ్నుల జేసినావు
నారాయణ నీవు నరుడవైనావు

రాతికి ప్రాణము రప్పించినావు
నాతి యెంగిలి కానందించినావు
కోతిమూకలనెల్ల గొలిపించినావు
నీటిపై కొండల నిల్పించినావు

లంకపై దండెత్తి లగ్గెక్కినావు
రావణ కుంభకర్ణుల ద్రుంచినావు
పంకజాక్షిని సీత పాలించినావు
లంకేశు దివ్యపుష్పక మెక్కినావు

పరగ నయోధ్యకు బరతెంచినావు
పట్టాభిషిక్తుడవై పాలించినావు
వర భద్రగిరియందు వసియించినావు
ధరను రామదాసు దయ నేలినావు


Download

అయ్యయో రఘురామయ్యా

అయ్యయో రఘురామయ్యా నిర్దయ జూచెదవేమయ్యా
ప్రియముగ కరమున బిరుదు వహించిన నయగుణనిధివని నమ్మితి నామది

కనకకిరీటం అడిగితినా నీ కర్ణభూషణము లడిగితినా
జినుగు పూసరుల నడిగితినా కాంచన చేలము నీదడిగితినా
ఘనవక్షస్థలిపై విలసిల్లెడు కౌస్తుభరత్నం బడిగితినా
యినశశి సాక్షిగ నే మీభక్తుండను దయనేలుమంటినెకాని

గళమున మెరయుచు నుండెడి మేల్పత కమ్ముల గొలుసుల నడిగితినా
పలుజిగిగల యిరు సందియ గట్టిన పచ్చలతాయతు లడిగితినా
కలిత హిరణ్మయ చిత్రవిచిత్రపు ఘంటల మొలత్రాడడిగితినా
సలలితకృపను ప్రపన్నుడ వగుటయు వెలనిధి పదివేలంటినెగాని

శరశరాసనము లడిగితినా నీ శంఖచక్రముల నడిగితినా
అరయక ధీరత నద్భుతమగు భాసుర తూణీరంబడిగితినా
స్ఫురితామరెరిపు గజసింహంబగు కరధృత ఖడ్గంబడిగితినా
చిరతర కీర్తి కుచేలుని బ్రోచిన ధరణి నేలుమని అంటినెగాని

సురుచిర తావకకరమున పెనగొను మురుగులు మురిడీలడిగితినా
నిరుపమ వజ్రశలాఖై నిలిచిన నిలువుటంగి నేనడిగితినా
గురుతుగ రంగుచెలంగెడి బంగరుకుచ్చుల నడికట్టడిగితినా
కరుణ జూచి రామదాసుపై కనికరము నిల్ప చాలంటినెకాని


Download

జై జై సీతారాం

జై జై సీతారాం జై జై శ్రీరఘురాం
కావవే సచ్చిదానంద ఫలమా
నావంటి దీనుని బ్రోచేటి ఘనమా

శరణాగతవత్సలా ఆగమసార
పరమపురుష నేనమ్మితి మనసార
పరిపూర్ణ కారుణ్య పారావార
సురమునిజన యోగిగణ పరిపాల

అజభవవందిత ఆర్తశరణ్య
గజరాజరక్షక ఘనకారుణ్య
మముబ్రోవ నీకన్న మహిదాతలేరి
శ్రమదీర్పవేమిర శరచాపధీర

కమలలోచన మముకరుణింపవే తండ్రి
విమలము మీపాద కమలము గొల్తుము
అద్రిజాధిపనుత ఆదరింపవేమయ్య
భద్రాచల రామదాసు బ్రోవ పరాకేల


Download

రామకృష్ణ గోవింద

రామకృష్ణ గోవింద నారాయణ
శ్రీరామకృష్ణ గోవింద నారాయణ 

రామకృష్ణాయని ప్రేమతో పిలిచిన
మోమైన జూపవేమి నారాయణా
అండజవాహన పుండరీకాక్ష నీ
దండ జేరినామయ్య నారాయణా

మాధవ విష్ణు మధుసూదన
శ్రీధర శేషశయన శ్రీమన్నారాయణా
వాసుదేవ ముకుంద వనమాలి చక్రధర
నారసింహాచ్యుత నారాయణా

పతితుడనిని నిన్ను బతిమాలుకొన్న సీతా
పతి నన్నుగావవేమి నారాయణా
రామదాసుని బ్రోవ ప్రేమతో భద్రాచల
ధాముడవైన శ్రీమన్నారాయణా


Download